నల్లకుంట: న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరిగే పేదలకు ఆయన ఆపద్భాందవుడు. ప్రజా సమస్యలను విస్మరించే ప్రభుత్వాన్ని తట్టిలేపుతాడు. కళ్లముందు జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను నిలదీయడమే కాకుండా చట్టాలపై సామాన్యులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను మేల్కొల్పుతున్నాడు. అతడే హైకోర్టు న్యాయవాది పూజల సాయికృష్ణ ఆజాద్. 12 ఏళ్ల క్రితం నల్లగొండ జిల్లా నుంచి నగరానికి వచ్చి నల్లకుంట శంకరమఠం సమీపంలో ఉంటున్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లా ఫర్ సొసైటీ డాట్ కామ్ పేరిట ఓ వెబ్ సైట్‌ను ప్రారంభించి పేదలకు ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తున్నాడు. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వారి కేసులను ఉచితంగా వాదిస్తూ న్యాయ సహాయం అందిస్తున్నారు. కొన్ని కేసుల్లో నిరుపేదలకు కోర్టు ఖర్చులు కూడా భరిస్తుండటం గమనార్హం. మదర్ థెరిసాను ఆదర్శంగా తీసుకుని 2008లో జన జాగృతి సంక్షేమ సంఘం స్థాపించాడు. పేదల కోసం విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, పేద విద్యార్థులకు పుస్తకాలు, వృద్ధులు, అనాథలకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేయడంలాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సేవా కార్యక్రమాల్లో కొన్ని…
వైజాగ్ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో శిశువును వీధి కుక్కలు చంపి తిన్నాయి. ఈ ఘటనపై ఆజాద్ మానవ హక్కుల సంఘం(హెచ్‌ఆర్సీ)లో పిటిషన్ వేసి బాధితులకు పరిహారం అందించారు.మూసీ నది కాలుష్యం విషయంలో చర్యలు తీసుకోవాలని నేషనల్ హెచ్‌ఆర్సీలో పిటిషన్ వేశారు. దీంతో మూసీ ప్రక్షాళనపై చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీని హెచ్‌ఆర్సీ ఆదేశించింది. ఉస్మానియా యూనివర్సిటీలో 2010లో పాత్రికేయులపై జరిగిన పోలీసు దాడిపై హెచ్‌ఆర్సీలో పిటిషన్ వేసి మీడియా హక్కులపై పోరాటం చేశారు.
సాక్షి కార్యాలయంపై జరిగిన దాడి విషయంలో న్యాయం కోసం హెచ్‌ఆర్సీలో పిటిషన్ వేశారు. స్పందించిన హెచ్‌ఆర్సీ ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించింది.మీడియా ప్రొటెక్షన్ లీగల్ సెల్‌ను 2010లో స్థాపించి మీడియా ప్రతినిధులపై జరిగే దాడులపై పాత్రికేయులకు న్యాయ సలహాలు అందిస్తున్నారు. న్యాయ సహాయం కోసం: www.advocatefornri.comవెబ్ సైట్‌లో లేదా సెల్ నంబర్ 99480 90355లో సంప్రదించగలరు.
ARTICLE BY SAKSHI NEWS PAPER
http://www.sakshi.com/news/hyderabad/azad-community-service-196322